నడుస్తున్న చరిత్ర ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్-తెలంగాణాల్లోనే కాక, పొరుగు రాష్ట్రాల్లోనూ నివసిస్తున్న తెలుగువారి శ్రేయస్సుకు, తెలుగు భాషోద్యమ నిర్మాణానికి కృషి జరిగింది. దానినే ఇప్పడు అమ్మనుడి కొనసాగిస్తున్నది.దక్షిణ భారతదేశమంతటా చిక్కగా అల్లుకొని, మొత్తం దేశంలోనేకాక, అనేక ఇతర దేశాల్లో కూడా భాషా సాంస్కృతిక మూలాలను విస్తరించుకొనివున్న తెలుగుజాతిలో చైతన్యాన్ని పెంపొందించి, వారిలో సంఘీభావాన్ని భావసమైక్యతను బలపరచవలసిన అక్కరను గుర్తించిన కొందరు కార్యకర్తలు అందుకోసం పనిచేస్తున్నారు. ఇందుకు తగ్గవిధంగా ఇంకా సమగ్రంగా, బలంగా ఒక పత్రికను, దానితోపాటు కొన్ని పుస్తకాలను ప్రచురించవలసిన అవసరం ఏర్పడింది. కొన్ని కార్యక్రమాల్ని కూడా చేపట్టవలసివుంది. ఇందుకోసం ఇప్పడు తెలుగుజాతి పేరిట ఒక ట్రస్టును నమోదు చేయించాము. (92/2014). తెలుగువారు అన్ని రంగాల్లో ముందడుగు వేసేందుకు తోడ్పడటమే ఈ ట్రస్టు లక్ష్యం. తెలుగు 'అమ్మనుడి'గా కలిగినవారు ఎక్కడ నివసిస్తున్నా, వారి శ్రేయస్సు కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ, ఇతర దేశాల్లోనూ వున్న తెలుగు ప్రజలకోసం ట్రస్టు పనిచేస్తుంది.
పుస్తకాల ప్రచురణ: తొలుతగా స.వెం.రమేశ్ వ్యాసాల సంకలనం 'ఎల్లలు లేని తెలుగు'ను విడుదల చేశాము. త్వరలో మరికొన్ని ప్రత్యేకమైన పుస్తకాలను వెలువరించ బోతున్నాము. ఈ ట్రస్టును బలమైన పునాదులపై, తగినన్ని వనరులతో ఏర్పరచటానికి మీ అందరి చేయూత కావాలి. ట్రస్టు నిర్మాణంలో తోడ్పడాలని విన్నవిస్తున్నాము.
ప్రజలందరూ ఎవరి మాతృభాషలో వారు ఎంతవరకైనా (అంటే పసి చదువుల నుండి పట్టా చదువుల వరకూ) చదువుకోగలగాలి, కోరుకున్నంత సౌకర్యవంతమైన జీనవం సాగించగలగాలి. అందుకు మొదటి మెట్టు మాతృభాషలో విద్యా బోధన. మాతృభాషలో సమాచారం అందుబాటు, అమ్మనుడిలో రోజువారీ వ్యవహారాల జరుగుబాటు అనేవి మలిమెట్లు.
© ammanudi.org.in. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి. Designed and Developed by eBhashasetu