తెలుగు భాషోద్యమ సమాఖ్యను 2003 ఫిబ్రవరి 21న స్థాపించినప్పటి నుండి తెలుగు భాష రక్షణ కోసం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాలలోను, ఇతర ప్రాంతాలలోను నిర్వహించుకొన్నాము. మిత్ర సంఘాలను కూడా ప్రోత్సహించాం. పాలన, బోధన రంగాల్లో తెలుగు అమలు కోసం ఉద్యమాలను నడిపి, న్యాయస్థానాలను కదిలించి అనేక సానుకూల ఉత్తర్వులను సాధించాం. తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపుకై ముందుగా జాతిని మేల్కొల్పి ప్రభుత్వాలను కదిలించి గుర్తింపును తెచ్చుకున్నాం. తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వశాఖ కోసమూ, తెలుగు అభివృద్ధి ప్రాధికార సంస్థ కోసమూ పోరాడి, వాటికై ప్రభుత్వ ఉత్తర్వులను సాధించుకోగలిగాం. అయినా పాలకుల్లో నిజాయితీ లేకపోవడంతో అదంతా అమలులో నీరుగారిపోయింది. ఇంతేగాక గత రెండు దశాబ్దాలకు పైగా విద్యారంగంలో విపరీతంగా చోటుచేసుకున్న కార్పొరేటీకరణ విధానాల వల్లా, పాలక పార్టీలు బోధనామాధ్యమంగా తెలుగును అణిచివేసినందువల్లా మాతృభాష ప్రగతికి ఎంతో నష్టం వాటిల్లింది. ఈ అనేక పరిణామాల ఫలితంగా భాషోద్యమంలో ప్రాథమ్యాలను, విధివిధానాలను తిరిగి నిర్ణయించుకోవలసివుంది. ఇందుకోసం తెలుగు భాషోద్యమసమాఖ్యలోకి అనుభవజ్ఞులైన వారినీ, యువతరాన్నీ, విద్యార్థి ఉపాధ్యాయ ప్రతినిధులను, వివిధ రంగాల నిపుణులను మరికొందరిని స్వాగతించి, సంస్థను మరింత చైతన్యవంతంగా, ప్రయోజనకరంగా తీర్చిదిద్దుకోవాలని నిర్ణయించాము. ఒక కేంద్ర విధాననిర్ణయ మండలిని కూడా మనం ఏర్పాటు చేసుకోవలసియున్నది.
గౌరవాధ్యక్షుడు
అధ్యక్షుడు
పలకండి పలకండి
తెలుగుపలుకులు
తెలుగు పలికితేనె కురుస్తాయి
తేనె చినుకులు
తెలుగులోన చదువు మనకు
పారే సెలయేరు
తెలుగులేని చదువు కాద?
ఎండమావి నీరు
తెలుగుబాట పూలబాట
ఎదుగుదలకు రాచబాట
తెలుగుజిలుగు లేని చోట
చీకటితో చెలిమేనట
తెలుగంటేనే వెలుగు
తెలుగుతోనె నువు వెలుగు
తెలుగులోనె మాట్లాడు
తెలుగుకొరకు పోట్లాడు
తెలుగు లేని తెలుగువాడు
ఎందులకూ కొరగాడు
తెలుగు వాడు తెలుగువాడె
ఈ నేలను ఏలతాడు
///-డా. అద్దంకి శ్రీనివాస్
ప్రజలందరూ ఎవరి మాతృభాషలో వారు ఎంతవరకైనా (అంటే పసి చదువుల నుండి పట్టా చదువుల వరకూ) చదువుకోగలగాలి, కోరుకున్నంత సౌకర్యవంతమైన జీనవం సాగించగలగాలి. అందుకు మొదటి మెట్టు మాతృభాషలో విద్యా బోధన. మాతృభాషలో సమాచారం అందుబాటు, అమ్మనుడిలో రోజువారీ వ్యవహారాల జరుగుబాటు అనేవి మలిమెట్లు.
© ammanudi.org.in. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి. Designed and Developed by eBhashasetu