ప్రజలందరూ ఎవరి మాతృభాషలో వారు ఎంతవరకైనా (అంటే పసి చదువుల నుండి పట్టా చదువుల వరకూ) చదువుకోగలగాలి, కోరుకున్నంత సౌకర్యవంతమైన జీనవం సాగించగలగాలి. అందుకు మొదటి మెట్టు మాతృభాషలో విద్యా బోధన. మాతృభాషలో సమాచారం అందుబాటు, అమ్మనుడిలో రోజువారీ వ్యవహారాల జరుగుబాటు అనేవి మలిమెట్లు.
“దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అనే నినాదం నుండి మనం “భాషంటే దాన్ని మాట్లాడే ప్రజలోయ్” అని చెప్పుకోవాలి. ఇదంతా మన కోసమే. మన భాష మన బాధ్యత. ఏదైనా మనం సంపాదించుకున్నది, తయారుచేసినది అయితే వదిలేసుకునే, పాడుచేసుకునే స్వేచ్ఛ మనకు ఉంటుంది. కానీ మన భాష అలా కాదు. ఇది మనకు వారసత్వంగా వచ్చింది. మనకు అందించబడింది. దాన్ని పెంచి, పోషించి ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. లేదా కనీసం మనం అందుకున్న స్థితి లోనే ముందు తరాలకు అందించాలి.
తోటి తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడుదాం. అసలు ఎవరితోనైనా సంభాషణ తెలుగులో మొదలుపెడదాం. వారు తెలుగువారు కాకపోతే అప్పుడు వేరే భాషలోకి దిగొచ్చు. వారికి తెలుగు రాదు అని ముందే ఊహించేసుకుని రాని భాషలో ఇబ్బంది పడొద్దు. తెలుగు నేలలో తెలుగు వ్యవహరించడం సహజం. మనం మరీ వంగిపోనవసరం లేదు.
సామాజిక మాధ్యమాలలోనూ విరివిగా తెలుగులో రాద్దాం. ప్రయివేటు వాట్సాప్, ఫేస్బుక్ సమూహాల్లోనూ తెలుగులో రాద్దాం. కాలక్షేపం కబుర్లూ, సినిమా రాజకీయ తదితర సమకాలీన అంశాలు మాత్రమే కాక మరికొంచెం గంభీరమైన విషయాలపై కూడా తెలుగులో రాద్దాం. వచనం, పాటలు, పద్యాలు, కవితలు, వ్యాసాలు ఏమైనా!
వ్యాపార సంస్థలను వారి ఉత్పత్తులను, సేవలను తెలుగులో అందించమని అడుగుదాం. ఇప్పటికే తెలుగులో ఉన్న ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం. సేవలను తెలుగులో వాడుకుందాం. ఆయా సంస్థల వినియోగదారుల సహాయ కేంద్రాల ద్వారా తెలుగు కావాలని మన ప్రతిస్పందనలలో తెలియజేద్దాం.
నేటికీ కంప్యూటర్లలోనూ, చరవాణుల్లోనూ తెలుగు ఎలా వ్రాయాలో తెలియనివారు చాలా మంది ఉన్నారు. మన చుట్టుపక్కలవారికి మనం సాంకేతిక సహాయం అందిద్దాం. మనం నిపుణులం అయివుండాల్సిన పనిలేదు. మనం తెలుగు ఎలా టైపుచేస్తున్నామో, చిన్న సమస్యలను ఎలా అధిగమిస్తున్నామో చెప్తే సరిపోతుంది.
పిల్లలకు, యువతరానికి తెలుగును చేరువచేసేందుకు వారికి ఉపయోగపడే బాల సాహిత్యం, కథలతో పాటు వారు ఎదుర్కొనే సమస్యలపై, సవాళ్ళపై చర్చలు, వ్యాసాలు గట్రా రాద్దాం. వాటిని యువతరం మాధ్యమాలలో (జాల మాధ్యమాలు యూట్యూబు, ఇన్స్టాగ్రామ్ గట్రాలలో) ప్రసారం, ప్రచారం చేద్దాం.
సంస్థాగతంగా తెలుగు కోసం పనిచేయాల్సిన సంస్థలను వారి పని చేయమని ముల్లుగర్రతో పొడవడం కూడా మన బాధ్యతలో భాగమే. ఆయా వ్యవస్థలు కాడి వదిలేసినప్పుడు అవసరమైతే మనం భుజం కాయాలి, ఆ వ్యవస్థలను గాడిలో పెట్టుకోవాలి.
Aliqu justo et labore at eirmod justo sea erat diam dolor diam vero kasd
ప్రజల తర్వాత వారిపై అత్యంత ప్రభావాన్ని చూపించే వ్యవస్థలు ఇవి. ఈ వ్యవస్థలు తెలుగు భాషలో నడుస్తూ, వాటి విధానాలు తెలుగు భాషకు అనుగుణంగా ఉన్నప్పుడు మన లక్ష్యం నెరవేరినట్టే.
ప్రభుత్వ ఉత్తర్వులు, నియమ నిబంధనలు, విధాన ప్రకటనలు, సంక్షేమ పథకాలు, తాఖీదులు, రశీదులు, ఇతరత్రా సమాచారం అంతా ప్రధానంగా తెలుగులోనే ఉండాలి.
పరిపాలన, ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు, పద్దులు, రికార్డులు అన్నీ తెలుగులోనే జరగాలి.
న్యాయస్థానాల్లో వాదప్రతివాదనలు తెలుగులో జరగాలి. తీర్పులను తెలుగులో వెలువరించాలి.
ప్రభుత్వం, దాని విభాగాలు ప్రజలకు అందించే సమాచారం, ప్రజాసంబంధాల నిమిత్తం నిర్వహించే అన్ని రకాల కార్యకలాపాలు (రేడియో టీవీ ప్రోగ్రాములు, వార్తాలేఖలు, సామాజిక మాధ్యమాలలో ప్రచారం గట్రా) అన్నీ తెలుగులో ఉండాలి.
ప్రజల మధ్య, సమాజంలోని తతిమా వ్యవస్థల మధ్య అంతరాల్ని పూడ్చి సంభాషణా వారధులుగా వ్యవహరించేవే మాధ్యమాలు. వీటికి ఉన్న ప్రాధాన్యత లేదా అవి పోషించే పాత్ర మూలంగా వీటిని ఫోర్త్ ఎస్టేట్‌గా వ్యవహరించారు. తెలుగు భాషకు ఆధునికహోదా తేవడంలో కూడా వీటిదే కీలక పాత్ర.
నేటి మార్కెట్-ఆధారిత పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యాపార సంస్థల పాత్ర అంచనాలకు మించిన ప్రాధాన్యం కలది. సేవా సంస్థలూ మరో వాటినుండి భాషకు తగ్గ తోడ్పాటు లభించినప్పుడే ఆధునికహోదా లభించినట్టు.
తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడయ్యే వస్తూత్పత్తులన్నీ (పేర్లూ, వాడుకునే సూచనలు, ఇతరత్రా వివరాలతో సహా) తెలుగులో ఉండాలి. ఇక్కడ అందించబడే సేవలు కూడా తెలుగులో/తెలుగు సమాచారంతో లభ్యమవాలి. వారి వ్యాపార ప్రకటనలూ తెలుగులో ఉండితీరాలి.
ఈ సంస్థలు ప్రభుత్వాలకు, ప్రభుత్వ విభాగాలకు దాఖలు చేసే నివేదికలు, వాటి పెట్టుబడిదార్లకు, వాటాదార్లకు, ఇతరత్రా భాగస్వాములకు, ప్రజలకు సమాచారం అందించే నిమిత్తం ప్రచురించే నివేదికలు, పత్రాలు తెలుగులో ఉండాలి.
తెలుగువారి సంస్థల్లో అంతర్గత కార్యకలాపాలు, పద్దులు, ఖాతా పుస్తకాలువంటివీ తెలుగులో నిర్వహించబడుతూండాలి.
ఇది మన కల. మనం చేరుకోవాల్సిన గమ్యం. ఇదొక బృహత్-లక్ష్యం. వాదాలలో పడి దిక్కుతోచక ఎటుపడితే అటు కొట్టుకుపోకుండా, మనం చేరాల్సిన తీరాన్ని సూచించే దిక్సూచి ఈ ఆశయ ప్రకటన. చీకటిలో దారిచూపే వేగుచుక్క. ఈ కలను సాకారం చేసుకోడానికి మనం రూపొందించుకునే కార్యాచరణను, దాని ఫలితాలను, ప్రభావాన్నీ పోల్చిచూసుకోవాల్సిన గీటురాయి కూడా ఇదే.
ప్రజలందరూ ఎవరి మాతృభాషలో వారు ఎంతవరకైనా (అంటే పసి చదువుల నుండి పట్టా చదువుల వరకూ) చదువుకోగలగాలి, కోరుకున్నంత సౌకర్యవంతమైన జీనవం సాగించగలగాలి. అందుకు మొదటి మెట్టు మాతృభాషలో విద్యా బోధన. మాతృభాషలో సమాచారం అందుబాటు, అమ్మనుడిలో రోజువారీ వ్యవహారాల జరుగుబాటు అనేవి మలిమెట్లు.
© ammanudi.org.in. All Rights Reserved. Designed by eBhashasetu